మా తాత గారైన శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారికి సంబంధించి
నాజీవితంలో జరిగిన ఒక వాస్తవిక సంఘటన

Logo

దాదాపు 16 సంవత్సరాల క్రిందట - 2004 సంవత్సరంలో నేను నా భార్యతో ఒక యాత్రకి వెళ్ళాను. ఆ యాత్రలో ఢిల్లీ , కాశి, ఆగ్రా, ఋషికేశ్ , హరిద్వార్ , శ్రీనగర్, ప్రముఖంగా ఉన్నాయి. సమయం తక్కువ, చూడాల్సినవి ఎక్కువ ఉండటంతో ప్రయాణమంతా దాదాపుగా విమానప్రయాణమే. మొదటగా కాశి ప్రయాణానికి బయల్దేరాము .
మేమిద్దరం హడావిడిగా పరుగులాంటి నడకతో ఉదయం ఏడు గంటలకు వారణాసి వెళ్లే విమానాశ్రయ ప్రవేశద్వారం దగ్గరకి వెళ్ళాము. బోర్డింగ్ పాస్ తీసుకుని విమానం లోకి వెళ్లి కూర్చున్నాము. ప్రొద్దున్న 10:30 గంటలకి వారణాసి చేరాము. విమానం దిగగానే వెంటనే టాక్సీ చేసుకుని కాశీ విశ్వనాధుని గుడికి వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకుని మళ్ళి విమానాశ్రయానికి మధ్యాహ్నం 3 గంటలకల్లా చేరుకోవాలి. నాలుగింటికి ఢిల్లీ వెళ్లే విమానం ఎక్కాలి. వారణాసి చేరి బయటకు రాగానే చాలా మంది టాక్సీ వాళ్ళు చుట్టుమూగారు. విశ్వనాథుని గుడికి వెళ్లి దర్శనం త్వరగా ముగించుకుని వెంటనే మళ్ళి విమానాశ్రయానికి 3 గంటలకల్లా కల్లా తిరిగి రావడానికి ఒక టాక్సీని మాట్లాడుకున్నాము. ఆ టాక్సీ లో డ్రైవరుతో పాటుగా ఇంకొకతను కూడా ఉన్నాడు.
అక్కడ నుండి గుడికి వెళ్ళడానికి ఒక గంట నుండి గంటన్నర పడుతుంది. దారి పొడుగునా ఏదో ఒకటి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్లిద్దరూ అన్నదమ్ములని, అక్కడే పుట్టి పెరిగారని ఇలా ఏవేవో చెప్తున్నారు. నేను కూడా ఏదో వచ్చీరాని హిందీలో మాట్లాడుతున్నాను. మా ఇద్దరిలో ఎదో కాస్త హిందీ తెలిసిన వాడిని నేనే... కానీ వాళ్ళ వాలకం, మాటలు చూస్తుంటే కొంచెం అనుమానాస్పదంగా ఉన్నాయి. నా భార్య మాత్రం నన్ను ఎక్కువగా మాట్లాడవద్దని వాళ్ళని ఎక్కువగా మాట్లాడించవద్దని సైగలు చేస్తూనే ఉంది. మా తిరుగు ప్రయాణానికి సమయం తక్కువగా ఉందన్న విషయం గ్రహించి వాళ్ళు మమ్మల్ని దింపిన చోటునుండి పడవలోనే వెళ్లాలని, ఇంకో దారి లేదని నమ్మబలికారు. కానీ నాకు మాత్రం పూర్తి నమ్మశక్యం కాలేదు, కానీ టైం ఎక్కువగా లేకపోవడం వలన వాళ్ళని నమ్మాను. పడవ మనిషితో నీకెంత ఇవ్వాలని అడిగితే, ఆ పడవ మనిషి అక్కడ నుండి గుడికి వెళ్ళడానికి 20 నిముషాలు పడుతుందని, మనిషికి 1200 రూపాయలు అవుతుందని చెప్పాడు. నేను ఆ టాక్సీ డ్రైవరుని అది సరియైన చార్జీనా అని అడిగాను. దానికి అతను తనకు తెలియదని, ఆ పడవ మనిషితోనే బేరం కుదుర్చుకోమని చెప్పాడు. అప్పటికి వీళ్ళ మోసం పూర్తిగా అర్ధమయ్యింది నాకు. కాశీ లోనే పుట్టి పెరిగానని చెప్పిన ఆ డ్రైవరుకి ఈ పడవ వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో తెలియదా అని అనుకుంటూ పడవ అక్కరలేదని నేను వెనక్కి తిరిగి, మాకు ఆరోజు కాశీ విశ్వనాథుని దర్శన భాగ్యం లేదనుకుంటూ, ఇక్కడ వరకు వచ్చి నా ప్రయత్నం చేశానని అనుకుని, విమానాశ్రయానికి తిరిగి వెడదామని చెప్పి వెనక్కి తిరిగాను. నా భార్య ఆందోళన చెందుతూ నాతో పాటే వెనుదిరిగింది. టాక్సీవాళ్లిద్దరూ కూడా ఇద్దరూ ఎదో మాట్లాడుకుంటున్నారు. నాకు ఒక పక్కన ఇక్కడ వరకూ వచ్చి విశ్వనాథుని చూడకుండా వెళ్లిపోవాలా? ఏమి చెయ్యాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే దారిలో "చల్లా వారి బట్టల దుకాణము " అనే బోర్డు కనిపించింది. కానీ తలుపులు వేసి ఉన్నాయి. తలుపులు తడితే ఒకాయన వచ్చి తలుపు తీశారు. ఆయనకి ఈ విషయం చెప్తే వెంటనే ఆయన "మీరు వీళ్ళ మోసంలో ఇరుక్కున్నారు, కానీ ఇక్కడ వాళ్లతో నేను ఏమి మాట్లాడినా బావుండదు ఎందుకంటే నేనిక్కడ వ్యాపారం చేసుకోవాలి కదా, అయినా ఒక సహాయం చేస్తాను. మీ వస్తువులన్నీ ఇక్కడ పెట్టుకోండి, నేనొక కుర్రవాడిని మీతో పంపుతాను. వాడు గుడికి తీసుకు వెళ్లి, దర్శనం చేయించి తిరిగి తీసుకు వస్తాడు. దర్శనం చేసుకోవడానికి పడవలో వెళ్లనక్కరలేదు. " అని చెప్పగా చాలా సంతోషించి అలాగేనన్నాను నేను.
ఆ కుర్రవాడి కోసం చాలా సేపు చూశాము, కానీ అతను ఎంతకూ రాలేదు. ఈ లోపల ఆయన నా పేరు అడిగితే 'తుమ్మలపల్లి శ్యాంప్రసాద్' అని చెప్పాను. వెంటనే అయన మీకు రామలింగేశ్వరరావు గారు తెలుసా అని అడిగారు. అయన మా తాతగారు అవుతారండి అనగా -- ఆయన వెంటనే అయ్యో ఆయన మనవడయ్యుండి వీళ్ళ వలలో ఎలా పడ్డారండీ అని అంటూ నాతో రండి నేనే మిమ్మల్ని గుడికి తీసుకు వెడతానని దగ్గర ఉండి గుడికి తీసుకు వెళ్లి, ఆలయమంతా చూపించి, తృప్తిగా దర్శనం చేయించి తిరిగి వాళ్ళ ఇంటికి తీసుకువచ్చారు. తీసుకు రావడమే కాకుండా, అది భోజన సమయమని, భోజనం చెయ్యాలని పట్టుబట్టి ఆయన భార్యతో చెప్పి భోజనం ఏర్పాటు చేసి చక్కటి వంకాయ కూర వగైరాలతో మడితో భోజనం పెట్టారు. మాతాతగారైన రామలింగేశ్వర రావు గారు ఆయనకి బాగా పరిచయమని కాశీలో చాలాసార్లు వారింటికి వచ్చారని ఆయన పేరు చింతామణి గణేష్ అని చెప్పారు. తాతగారి తో పట్టుమని పది నిమిషాలు ఎప్పుడూ మాట్లాడలేదు కానీ ఆ రోజు మేమిద్దరం ఆ టాక్సీ డ్రైవరు మోసం బారి నుండి బయటపడి, అనుకోని విధంగా అంత చక్కగా విశ్వనాథుని దర్శించుకున్నామంటే అది తప్పకుండా ఆయన ఆశీస్సుల వల్లనే అని మేమనుకున్నాము. వెంటనే బయల్దేరి విమానాశ్రయానికి సమయానికి వచ్చి చేరుకున్నాము.
అప్పటికి 18 సంవత్సరాల క్రిందట, (1986) మా అత్తయ్య వాణికుమారి గారి ఇంట్లో ఉన్నపుడు ఒకసారి రామలింగేశ్వర రావు తాతయ్య గారు అత్తయ్య ఇంటికి వచ్చారు. ఆయనకీ నేను రాముడి కొడుకు (రామారావు గారు మా నాన్నగారు) అని చెప్పింది మా అత్తయ్య. నేనెవరో తెలుసురా అని ఆయన అడిగితే తెలియదని చెప్పాను. వెంటనే ఎదో పద్యం చెప్పి, గండరగండడనయిన నేనే తెలియదంటావురా అని అన్నారు. నిజానికి అప్పటికి తెలియలేదు కానీ తరువాతి కాలంలో ఈ సంఘటన ద్వారా ఆయన ఏమిటో కొంత తెలిసింది. విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి మహాకవుల విశేష ప్రశంసలు అందుకున్న సిద్ధపురుషులు రామలింగేశ్వర రావు గారే మా తాతయ్య గారని చెప్పటం చాలా ఆనందంగానూ గర్వంగానూ ఉంటుంది.
ఆయన పేరుకే అంత గొప్పతనముంటే ఆయనకి ఉన్న గొప్పతనం ఊహించుకోవచ్చు. సామవేదం షణ్ముఖశర్మ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, పరిపూర్ణానంద స్వామి వారు ఆయన గురించి చెబుతూ ఆయన ఒక సిద్ధ పురుషుడని, మహా కవి అని చెప్తుంటే ఎంతో ఆనందంగా ఉండేది.
నిస్సందేహంగా ఆయన విద్వత్తు, ఆయనపై ఉన్న అమ్మవారి అనుగ్రహ కటాక్షము , శివానుగ్రహము అమోఘమైనవి. ఆయనతో బంధము, అనుబంధమున్న ప్రతి ఒక్కరు ధన్యులు !!
శ్రీ అద్వయానంద భారతి స్వామి వారికి కృతజ్ఞతాభివందనలతో , వినమ్రతతో, శత సహస్ర నమస్సులతో, పాదాభివందనలతో ... శ్యాము 🙏🙏🙏

Shyam, USA
shyam007@yahoo.com

బ్రహ్మశ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వర రావుగారి రచనలు మరియు వారి వ్యక్తిత్వం గురించి శృంగేరీ జగద్గురువులు
శ్రీ భారతీ తీర్థ మహాస్వాములవారి వ్యాఖ్య

(మూలం: శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వర రావు నవలలు – పరిశీలన, డాక్టర్ ముత్తేవి శ్రీనివాస్ గారి పిహెచ్.డి సిధ్ధాంత గ్రంథము, రాధా మాధవ్ పబ్లికేషన్, సంగారెడ్డి,1998)

“శృంగేరీ జగద్గురువులు శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి కృపకు పాత్రులై వారిచే శ్రీవిద్యా మంత్రోపదేశమును పొందిన శ్రీ రామలింగేశ్వర రావుగారి రచనలు భారతీయ సనాతన సంప్రదాయ వైశిష్ట్యము, భారతీయుల ధర్మనిష్ఠను ప్రతిబింబించుచూ వచ్చినవి. “అకర్తవ్యం నకర్తవ్యం ప్రాణైః కంఠ గతైరపి” అను సూత్రమును తన జీవితమునందాచరించుటయే గాక తన సాహిత్యమునందలి పాత్రలకు ఆ సూత్రమును సంపూర్ణముగా అన్వయింపజేసిన ధీరుడాయన. సత్యవదనమునకు భారతీయ సంస్కృతియందుగల మహోన్నత స్థానమును చక్కగా గుర్తెరిగి సత్య ప్రచారమునకు తన జీవితమును సమర్పించుకొనిన ఉత్తమ శీలుడాయన. ఆయనకుగల గురుభక్తి వర్ణనాతీతము. ఆయన చెప్పిన ఈ క్రింది పద్యము వలన అది ప్రస్ఫుటమగుచున్నది.

మరియును కర్మశేషమున మానవ జన్మము కల్గెనేని శం
కరగురు రాజమౌళి పరికల్పిత శృంగ నగస్థ శారదా
చరణ సరోజ పీఠమున సర్వమహః పరిలీన మూర్తియై
పరగు జగద్గురున్ గొలుచు భాగ్యము నాకు నొసంగు మీశ్వరా.”

Back to
Home Page